karma siddhantam
ఒక ప్రభుత్వాన్ని నడపటానికి రాజ్యాంగం ఎలాగో, ఈ సృష్టి నంతటినీ నడపటానికి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉన్నది. రాజ్యాంగం మానవ నిర్మితం. అందువల్ల కొన్ని లొసుగులతో ఉంటుంది..సవరణలకు గురి అవుతూ ఉంటుంది. కొందరికి కొన్ని మినహాయింపులుంటాయి.
Table of Contents
Togglekarma siddhantam కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి ?
కర్మసిద్ధాంతం భగవన్నిర్మితం. ఎట్టి లొసుగులు లేనిది. వీటికి సవరణలు చేయటం ఉండదు. దీనిలో ఎవరికీ ఎట్టి మినహాయింపులు ఉండవు. బంధుప్రీతి, ఆశ్రితజన పక్షపాతం, లంచాలు, రికమెండేషన్లు ఏవీ ఉండవు. దీని ముందు అందరూ సమానులే.
ఇటువంటి స్థిరమైన శాసనం కర్మసిద్ధాంతం. ఈ కర్మసిద్ధాంతం అనేది చేసిన ‘కర్మల’ మీద ఆధారపడి ఉంటుంది.
కర్మ అంటే ఏమిటి ? ఎన్ని రకాలు ?
మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకొనేంతవరకు మనం చేసేపనులు అన్నీ కర్మలే. ఇలా ప్రతి మానవుడూ పుట్టిన దగ్గరనుండి చచ్చేంతవరకు కర్మలు చేస్తూనే ఉంటాడు. ఇలా కర్మలు చేస్తే ఆ కర్మలకు ఫలితం వస్తుంది.
మనం చేసే ప్రతి కర్మకూడా ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చియే తీరుతుంది. అవి ఫలితాన్నిచ్చే సమయాన్ని బట్టి కర్మలను 3 రకాలుగా విభజించారు. అవి
- ఆగామి కర్మలు
- సంచిత కర్మలు
- ప్రారబ్ధ కర్మలు.
ఆగామి కర్మలు
ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే. అయితే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చి శాంతిస్తాయి. కొన్ని అప్పటికప్పుడు ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టబడి ఉంటాయి.
ఉదాహరణకు మనం భోజనం చేస్తాం. అది కర్మ. వెంటనే మనకు ఆకలి తీరుతుంది. అది కర్మఫలం, నీరు త్రాతగుతాం. అది కర్మ. దప్పిక తీరుతుంది. అది కర్మఫలం.
ఎవరినైనా కోపంతో తిడతాం. అది కర్మ. అవతలివాడు బలంగలవాడైతే చెంప పగలగొడతాడు. అది కర్మఫలం. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చి శాంతిస్తాయి.
కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు. ఉదాహరణకు ఎదురుగా లేని వాణ్ణి తిడతాం. వాడిమీద నిందలు వేస్తాం. కాని వాడు ఎదురుగాలేడు గనుక అప్పటికప్పుడు ఫలితంరాదు. దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం. అవన్నీ వెంటనే ఫలితాన్నిచ్చేవి. కావు.
మన పిల్లలు పరీక్షలు వ్రాస్తారు. ఫలితం 2 నెలల తర్వాత ఎప్పుడో వస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితాన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే,
సంచిత కర్మలు
ఇంతకుముందు జన్మలో చేసి తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వటానికి కూడబెట్టబడిన కర్మలలోనుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించినవి పోను, మిగిలినకూడబెట్టబడిన కర్మలను,
అదేవిధంగా అంతకుముందు అనేక జన్మలలో చేసిన కర్మలనుండి ఖర్చు అయినవిపోగా ఒక జన్మనుండి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలంటారు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి విడిచి పెట్టకుండా అతడితో ప్రయాణమై వస్తుంటాయి.
మనం అద్దె ఇళ్ళల్లో ఉండి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారేటప్పుడు ఆ యింటిలో మనం సంపాదించిన డబ్బు, వస్తువులను, అలాగే అంతకుముందు ఇళ్ళలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు, వస్తువులలో ఖర్బైపోయినవి పోగా మిగిలిన డబ్బు, వస్తువులను కలిపి ఎలా మూటగట్టుకొని వెళతామో..
అలాగే జీవుడు భగవంతుడిచ్చిన అద్దెకొంపలాంటి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆయాశరీరాలలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక అద్దె కొంపలాంటి శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా తీసుక వెళ్ళే మూటలే సంచిత కర్మలు..
ప్రారబ్ధ కర్మలు
అనేక సంచిత కర్మలు జీవుడితో కలసి ప్రయాణిస్తాయని చెప్పుకొన్నాం. ఏ ప్రాణి ఐనా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఎక్కౌంటులో ఉన్న సంచిత కర్మలనుండి, ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో, పండుతాయో, ఫలితాన్నివ్వటానికి సిద్ధంగా ఉంటాయో వాటిని ప్రారబ్ద కర్మలు అంటారు.
ఆ ప్రారబ్ధ కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, తగిన శరీరంతో. జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు. అలా వచ్చిన జీవుడికి ఆ ప్రారబ్బ కర్మఫలాలన్నీ అనుభవించటం పూర్తయ్యేదాకా శరీరం ఉంటుంది.
ఆ కర్మ ఫలాలు అనుభవించటం పూర్తికాగానే ఆ క్షణంలోనే ఆ శరీరం వదలిపోతుంది. ఒక్కక్షణం ఉండమన్నా ఉండదు.
అప్పటిదాకా దేవుడా ! నన్నెప్పుడు తీసుకెళతావయ్యా అని ఎంత ఏడ్చినా, మ్రొక్కినా, ప్రార్థించినా ప్రయోజనం లేదు. ప్రారబ్ధ కర్మలు పూర్తి ఐన తర్వాత ఒక్కక్షణం ఉందామన్నా కుదరదు.