మీరు ఆరోగ్య సమస్య లేదా ప్రమాదానికి గురైనప్పుడు, డా॥ వై. యస్. ఆరోగ్యశ్రీ (arogyasri) ద్వారా ఉచిత వైద్యం పొందడం ఇప్పుడు సులభం. ఈ దిగువన తెలియజేసిన పద్ధతుల ద్వారా సంబంధిత ఆసుపత్రులలో చేరి మీరు ఉచిత వైద్యం పొందవచ్చు.
- 104 కాల్ సెంటర్ ద్వారా
- విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా
- 108 అంబులెన్సు ద్వారా
- ఫ్యామిలీ డాక్టర్ ద్వారా
- ప్రాథమిక వైద్య కేంద్రం (PHC) ద్వారా
- వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ యాప్ ద్వారా
Table of Contents
Toggle104 కాల్ సెంటర్ ద్వారా
మీ ఇంటి నుండే 104 కాల్ చేసి మీ ఆరోగ్య సమస్యను వివరించండి. వెంటనే కాల్ సెంటర్ అధికారి మీ వివరాలను నమోదు చేసుకుని, మీకు మార్గనిర్దేశం చేస్తారు. మీకు అవసరమైన ఉచిత చికిత్స అందించే ఆరోగ్య శ్రీ ఆసుపత్రి వివరాలను మీకు అందిస్తారు. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రి లో ఉండే సంబంధిత ఆరోగ్య మిత్ర వివరాలను, ఫోన్ నంబర్ను కూడా మీకు తెలియజేస్తారు. మీ వివరాలను వారికి కూడా తెలియజేస్తారు. ఆసుపత్రి లో మీరు చేరేంత వరకు వారు బాధ్యత తీసుకుంటారు.
విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా arogyasri
మీ గ్రామంలో మీ కుటుంబానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్న మీ వాలంటీర్ను సంప్రదించినా, లేక మీ విలేజ్ హెల్త్ క్లినిక్ లేదా వార్డు లో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్ కు వెళ్లి, అక్కడ ఉన్న ANM, CHO లకు మీ ఆరోగ్య సమస్యను తెలియజేయవచ్చు. వెంటనే ఆ ANM లేదా CHO మీ ఆరోగ్య సమస్యకు చికిత్స అందించేందుకు మీకు సమీపంలో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. ఆ నెట్వర్క్ ఆసుపత్రిలో ఉండే ఆరోగ్య మిత్రకు మీ వివరాలు అందించి, అడ్మిట్ అయ్యే వరకు వారితో సమన్వయం చేసుకుంటారు. తద్వారా మీరు ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందవచ్చు.
108 అంబులెన్సు ద్వారా arogyasri
ఎమర్జెన్సీ సమయాల్లో మీరు నేరుగా 108 కు కాల్ చేసి మీ ఎమర్జెన్సీని చెబితే నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ మీ ఇంటికి వస్తుంది. అవసరమైన ప్రాథమిక చికిత్స అందించడమే కాకుండా మిమ్మల్ని, ఉచితంగా వైద్యం అందించే సమీపంలోని నెట్ వర్క్ ఆసుపత్రికి తీసుకెళ్తుంది. నెట్వర్క్ ఆసుపత్రులలో ఉండే ఆరోగ్య మిత్రల సహకారంతో అత్యవసర వైద్యసేవలు మీకు అందజేయబడతాయి.
ఫ్యామిలీ డాక్టర్ ద్వారా arogyasri
ఫ్యామిలీ డాక్టర్ మీ గ్రామాన్ని సందర్శించినప్పుడు మీ ఆరోగ్య సమస్యను పరిశీలించి, తదుపరి చికిత్స అవసరమని భావిస్తే ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది. అప్పటివరకూ మీకు అందించిన వైద్యం వివరాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్యామిలీ డాక్టర్ నెట్ వర్క్ ఆసుపత్రికి నివేదిస్తారు. మీ విలేజ్ క్లినిక్ లేదా వార్డు లో ఉండే ANM లేదా CHO లు మీరు నెట్వర్క్ ఆసుపత్రిలో చేరేందుకు సహాయ పడతారు.
ప్రాథమిక వైద్య కేంద్రం (PHC) ద్వారా
మీకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే డాక్టర్ను సంప్రదిస్తే ఆయన మీ సమస్యను పరిశీలించి అవసరమైతే తదుపరి చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి పంపిస్తారు. మీకు అవసరమైన చికిత్స అందించేలా చూసుకుంటారు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ (arogyasri) యాప్ ద్వారా
ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి ఏ ఏ పత్రాలు తీసుకువెళ్లాలి. ఎవరిని కలవాలి, అక్కడ ఏ ఏ సేవలు ఉచితంగా అందిస్తారు
మీరు ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు (లేదా) ఆధార్ కార్డు మరియు మీ ఆరోగ్యశ్రీ కార్డు లో ఉండే కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి.
ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వెళ్ళగానే ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం వద్ద ఉండే ఆరోగ్య మిత్రను సంప్రదించాలి. వారు మీకు సంబంధించిన ఆరోగ్య సమస్య తెలుసుకొని ఆ స్పెషాలిటీ వైద్యుల ద్వారా చికిత్స అందించడంలో సహాయ పడతారు.
మీకు ఆసుపత్రిలో ఉచితంగా అందించే సేవలు:
- ఉచిత అడ్మిషన్
- డాక్టర్ సంప్రదింపులు (ప్రతి రోజు).
- నర్సింగ్ సేవలు (ప్రతి రోజు).
- అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు.
- అవసరమైన మందులన్నీ ఉచితముగా ఇవ్వబడును.
- శస్త్ర చికిత్స (ఆపరేషన్) / చికిత్స).
- శస్త్ర చికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్లు.
- అల్పాహారము, భోజనము (రెండు పూటలు).
- డిశ్చార్జ్ సమయంలో సరిపడా మందులు.
- మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెస్ట్ పీరియడ్ కోసం అయ్యే ఖర్చు నిమిత్తం ఆరోగ్య ఆసరాగా డబ్బులు సైతం మీ బ్యాంకు అకౌంట్ కు పంపిస్తారు.
- ఇంటికి వెళ్ళడానికి అవసరమయ్యే చార్జీలు ఉచితముగా ఇవ్వబడును.
- 10 రోజుల తరువాత ఆసుపత్రికి వచ్చి మీరు మళ్ళీ ఉచితంగా చూపించుకోవచ్చు.
- అవసరమైన చికిత్సలకు ఒక సంవత్సరం పాటు డాక్టర్ సంప్రదింపులు, వైద్య పరీక్షలు మరియు మందులు కూడా ఉచితంగా అందిస్తారు.
- డిశ్చార్జ్ అయ్యే సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు రాలేదని, మీరు సొంత డబ్బులు చెల్లించ లేదని, ఎవరికి, ఏ అవసరానికి డబ్బులు ఇవ్వలేదని, ఎవ్వరు మందుల పేరుతోను, టెస్ట్ లు పేరుతోను, లేక మరెవరి పేరుతోను డబ్బులు మీతో కట్టించుకోలేదని ధృవీకరిస్తూ మీరు ధృవీకరణ పత్రం సంతకం చేసి ఇవ్వాలి. దానితో పాటు సమ్మతి పత్రం కూడా ఇవ్వాలి.
దీని వల్ల మీకు ఉచితంగా వైద్యం అందుతుంది. ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకుంటే వారి మీద చర్యలు తీసుకోబడతాయి.
ఆరోగ్యమిత్ర మీ సేవ కోసం ప్రభుత్వంచే నియమించ బడ్డవారు, ఆరోగ్యశ్రీ లోగో కలిగిన తెల్లటి ఆప్రాన్ ధరించి ఉంటారు. వారు మీరు ఆసుపత్రిలో చేరిన నాటి నుండి మీరు కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు మీకు సహాయ పడతారు.
వై.యస్.ఆర్ ఆరోగ్య ఆసరా పథకం
ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం పొంది డిశ్చార్జ్ అయిన తరువాత విశ్రాంతి సమయంలో జీవనోపాధి కోల్పోయే పరిస్థితి కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 1, 2019 నుంచి ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకంలో 1519 రకాల చికిత్సలకు వైద్యుల సలహామేరకు విశ్రాంతి తీసుకొనే సమయంలో రోజుకి రూ. 225 చొప్పున నెలకు గరిష్టంగా 5000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
పైన సూచించిన మొత్తం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపే నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. మీకు ఆరోగ్య ఆసరా క్రింద జమ చేయబడిన మొత్తం వివరాలు www.ysraarogyasri.ap.gov.in ద్వారా లేదా ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకొనవచ్చును.
ఆరోగ్యశ్రీ సేవలు సంతృప్తికరంగా లేని యెడల ఫిర్యాదు చేయు విధానము
ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని సేవలు ఉచితం
ఆసుపత్రిలో అయినా, ఏ సేవకైనా డబ్బులు అడిగినా, మందులకు గాని, వైద్య పరీక్షలకు గాని లేక మరేసేవకైన డబ్బులు అడిగినా, ఆరోగ్యమిత్ర సేవలు సంతృప్తిగా లేకపోయినా, ఆరోగ్యశ్రీ లో వైద్యాన్ని ఆ హాస్పిటల్ వారు నిరాకరించినా, ఈ క్రింది విధానంలో ఫిర్యాదు చేయవచ్చును.
మీకు వైద్యం పొందే సమయంలో ఆరోగ్యమిత్ర కానీ, హాస్పిటల్ వారు గాని, మరెవరైనా కానీ లంచం అడిగితే 14400 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
మీరు డిశ్చార్జ్ అయిన తరువాత నాలుగు నుంచి ఎనిమిది దినాల వ్యవధిలో మీ విలేజ్ హెల్త్ క్లినిక్ లోని మీ ప్రాంత ANM మీ వద్దకు వచ్చి మీ ఆరోగ్య పరిస్థితి విచారించి వైద్యసేవలు అందించిన విధానం మీద మీ యొక్క అభిప్రాయం సేకరిస్తారు.
ఆరోగ్యశ్రీ ఆసుపత్రి లోని వైద్యసేవలలో లోటుపాట్లు ఉన్నా, ఆరోగ్యమిత్ర సేవల మీద అసంతృప్తి ఉన్నా, అందచేసిన వైద్యసేవలకు డబ్బులు వసూలు చేసినా సంబంధిత వివరాలు ANM కు కంప్లైంట్ చేయవచ్చును.
మీ ఫిర్యాదు మేరకు తగు విచారణ జరిపి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మీ డబ్బులు మీ బ్యాంకు అకౌంట్ లో తిరిగి జమ చేయబడుతుంది మరియు మీకు ఇబ్బంది కలగచేసిన వారి మీద యాక్షన్ కూడా తీసుకోబడుతుంది.